ఓటు హక్కుపై వైఎస్‌ జగన్‌ కీలక సూచనలు

11 Mar, 2019 19:57 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా ఎన్నికల నగారా మోగించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఓటు హక్కు విషయంలో కీలకమైన సూచనలు చేశారు. ఇటీవల ఆంధ్ర ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ గురికావడం.. అధికార టీడీపీ ఓట్ల తొలగింపునకు యత్నిస్తుందనే ఆరోపణలు వస్తున్న వేళ ఆయన ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ ఓటు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటర్‌ ఐడీ కార్డు మీద ఎపిక్‌ నంబర్‌ను 1950కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుందని చెప్పారు. ఓటు లేని వాళ్ళు ఆన్‌లైన్‌లో ఫామ్‌-6 నింపి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఎమ్మార్వో ఆఫీసులో గానీ, బుత్‌ లెవల్‌ అధికారిని గానీ సంప్రదించాలని సూచించారు. ప్రతి ఓటు కీలకమైందని పేర్కొన్నారు. రాబోయే నెల రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పని అబద్దం, చేయని మోసం, వేయని డ్రామా ఉండదని.. అవన్నీ ఎల్లో మీడియాలో కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ శ్రేణులు యుద్దం చేస్తుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదని.. ఎల్లో మీడియాతో కూడా అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు