గంభీర్‌పై పోలీసులకు ఫిర్యాదు

26 Apr, 2019 14:37 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల బరిలోకి నిలిచిన టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్‌ రెండు ఓటర్‌ కార్డులు కలిగివున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమ్‌ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విటర్‌లో ద్వారా తెలిపారు. ఢిల్లీలోని రెండు నియోజకవర్గాల్లో గంభీర్‌కు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. కారోల్‌ బాగ్‌, రాజిందర్‌ నగర్‌లో ఓటు ఉన్నట్టు ట్వీట్‌ చేశారు. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని తెలిపారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గంభీర్‌ పోటీ చేస్తున్నారు. (చదవండి: గంభీరే అధిక సంపన్నుడు)

కాగా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలతో పోటీ పడటం కంటే ప్రధాని నరేంద్ర మోదీ హామీలను అమలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఆప్‌ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రత్యేక రాష్ట్ర హోదా అంశాన్ని కేజ్రీవాల్‌ తెర మీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు. మోదీ, అమిత్‌ షా ఓడించాలన్న ఉద్దేశం తప్పా కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు మరో ఆలోచన లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు తమకు పోటీ కానేకాదని అన్నారు. తనను గెలిపిస్తే తూర్పు ఢిల్లీ నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతానని హామీయిచ్చారు. దేశ రాజధాని ఎలా ఉండాలో అలా తయారు చేస్తానని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం అతి పెద్ద సమస్య అని తెలిపారు.

మరిన్ని వార్తలు