ఆప్‌లో ముసలం తెచ్చిన రాజీవ్‌

22 Dec, 2018 11:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఆమ్‌ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆప్‌ శాసనసభ్యురాలు ఆల్కా లాంబా శనివారం తెలిపారు. కాగా సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్‌ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలిన ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఆల్కా లాంబాంతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

సభలో చర్చ సందర్భంలోనే తాను వ్యతిరేకించి సభ నుంచి బయటకు వచ్చినట్లు చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే ఆల్కా లాంబా తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసిన పార్టీ నాయకత్వం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పార్టీ ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. కాగా రాజీవ్‌కిచ్చిన భారతరత్న అవార్డును ఉపసంహరించుకోవాలని ఆప్‌ ఎమ్మెల్యే జర్నాలి సింగ్‌ చేసిన ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్‌ స్పందించింది. ఆప్‌ను తామెప్పుడూ బీజేపీ పక్షంగానే భావిస్తామని ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ మాకెన్‌  విమర్శించారు. దేశ ప్రధానిగా రాజీవ్‌ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన ప్రాణాన్ని సైతం దేశం కోసం త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు