వ్యవస్థను వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

27 Mar, 2019 13:36 IST|Sakshi

సాక్షి, కర్నూలు : అధికారులతో పాటు, వ్యవస్థలను వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్‌ చేసి వారిని రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఎస్వీ మోహన్‌ రెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారు.

ఆయన దృష్టి అంతా మొత్తం రాజకీయంపై ఉండేదని, అందుకు సంబంధించిన విషయాలను వెంకటేశ్వరరావు  ప్రతిరోజు చంద్రబాబుకు వివరించేవారన్నారు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతలపై కన్నా రాజకీయంగానే ఎక్కువ ఆసక్తి చూపించేవారని ఎస్వీ మోహన్‌ రెడ్డి వ్యాఖ‍్యానించారు. పార్టీ టికెట్‌ ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలని నిర్ణయించేది వెంకటేశ్వరరావేనని అన్నారు. అధికారులను టీడీపీ ఏవిధంగా మభ్యపెడుతుందో అందరికీ తెలుసునని అన్నారు. పోలీస్‌ శాఖను వాడుకుని ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలనుకుంటున్నారని ఎస్వీ మోహన్‌ రెడ్డి విమర్శించారు. కాగా ఇంటెలిజెన్స్‌ ఐజీ విధుల నుంచి ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. చదవండి....(ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు)

మరోవైపు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ అన్నది సాధారణ అంశమే. ఇప్పుడే కాదు.. ఏ ఎన్నికల సమయంలోనైనా ఈసీ తన అధికారాలను ఉపయోగించుకుంటుంది. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను ఈసీ బదిలీ చేసింది. నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎస్‌ఎస్‌పీ యాదవ్‌పై ఫిర్యాదు చేయడంతో ఆ వెంటనే ఈసీ బదిలీ చేసింది. ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ వికారాబాద్‌ ఎస్పీగా ఉన్న అన్నపూర్ణను బదిలీ చేసింది ఈసీ. రేవంత్‌ అరెస్ట్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతో వికారాబాద్‌ ఎస్పీని బదిలీ చేసింది ఈసీ. 

మరిన్ని వార్తలు