అభినందన్‌ నిజంగా ఓటేశారా!?

16 Apr, 2019 14:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారంటూ ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. బీజేపీకి మద్దతు తెలియజేస్తున్న ఫేస్‌బుక్‌ పేజీలు, గ్రూపులు ఈ పోస్ట్‌ను తెగ షేర్‌ చేస్తున్నాయి. షేర్‌ చేయాల్సిందిగా మిత్రులను కోరుతున్నాయి. (చదవండి: ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ!)

‘వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేయడం కోసం ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. మోదీకి మించిన మంచి ప్రధాని మరొకరు లేరన్నారు. మిత్రులారా! ఈ విషయం జిహాదీలు, కాంగ్రెసీలకు చేరే వరకు షేర్‌ చేయండి’ అన్న వ్యాఖ్యలతో వర్థమాన్‌ను కాస్త పోలిన వ్యక్తి ఫొటోను పోస్ట్‌ చేశారు. మెడలో కమలం గుర్గు కలిగిన కాషాయ కండువాను ధరించిన ఆ ఫొటోలోని వ్యక్తికి అభినందన్‌కు ఒక్క మీషాల విషయంలోనే పోలిక ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం తరఫున పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయిన అభినందన్‌ విమానాన్ని పాక్‌ సైనికులు కూల్చివేయడం, రెండు రోజుల నిర్బంధం అనంతర అభినందన్‌ హీరోలాగా దేశానికి తిరిగి రావడం తదితర పరిణామాలు తెల్సినవే. (చదవండి: ప్రచారం కోసం ఇంత అబద్ధమా!)

పోలికల్లో తేడాలు
1. అభినందన్‌ వర్థమాన్‌ వయస్సుకన్నా ఆ ఫొటోలోని వ్యక్తి వయస్సు ఎక్కువగా ఉంది.
2. ఫొటోలోకి వ్యక్తి బుగ్గల కింద, మీసాలపైన ముడతలు ఉన్నాయి. వయస్సు రీత్యా, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అలాంటి ముడతలు వస్తాయి. అభినందన్‌కు వృత్తిరీత్యా వ్యాయామం ఉంటుంది కనుక అలాంటి ముడతలు లేవు.
3. ఫొటోలోని వ్యక్తి భుజాలు జారీ పోయినట్లుగా ఉన్నాయి. అభినందన్‌ భుజాలు అలా లేవు.
4. ఫొటోలోని వ్యక్తి మెడపైన ముడతలు ఉన్నాయి. అభినందన్‌కు లేవు. పైగా అభినందన్‌ మెడ పొడుగ్గా ఉంటుంది.
5. ఫొటోలోని వ్యక్తి ముక్కు కొద్దిగా లావుగా కూడా ఉంది.
6. అన్నింటికంటే అభినందన్‌ పెదవుల కింద పుట్టుమచ్చ ఉంది. ఫొటోలోని వ్యక్తికి కుడికన్ను దిగువున పుట్టుమచ్చ ఉంది. అభినందన్‌కు లేదు.
7. కళ్లను చూసి మనిషిని ఇట్టే గుర్తు పట్టవచ్చ. అందుకని కళ్లు కనపడకుండా ఫొటోలోని వ్యక్తికి కళ్లజోడు టోపీ పెట్టి మనల్ని బురడీ కొట్టించేందుకు ప్రయత్నించారు.

భారత వైమానిక దళంలో ఉన్న వాళ్లు సాధారణంగా విధుల్లో ఉన్నప్పుడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకుంటారు. అభినందన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఆయన ఓటు హక్కు ఉంటే తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ఇంతవరకు పోలింగే జరగలేదు. ఈ నెల 18వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. వర్ధమాన్‌ ఒక్కరి కోసం పోలింగ్‌ నిర్వహించారా? (చదవండి: మార్ఫింగ్‌ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం)

1969, ఎయిర్స్‌ ఫోర్స్‌ రూల్స్‌
1969 నాటి వైమానిక దళం నిబంధనల ప్రకారం ‘ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకారాదు. వాటిని ఉద్దేశించి ప్రసంగించరాదు. అసలు రాజకీయ కార్యకలాపాలతోనే ప్రమేయం ఉండరాదు. ఉద్యమాల్లోను పాల్గొనరాదు. సహాయం చేయరాదు. ఓటర్లను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు’ ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపైన శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయి. అంటే అభినందన్‌ ఉద్యోగానికి ఎసరు తీసుకరావడం కోసమే బీజేపీ వర్గాలు ఈ నకిలీ వార్తను సృష్టించాయా?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు