మమతకు మద్ధతు.. కాంగ్రెస్‌లో చిచ్చు

7 Apr, 2018 09:49 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్ధతు విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ముసలం మొదలైంది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితులు చేరాయి. 

విషయం ఏంటంటే.. పశ్చిమ బెంగాల్‌లోని 20 గ్రామాల్లో వచ్చే నెల(మే 1,2, 5వ తేదీల్లో) పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బలగాలను మోహరింపజేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ అభిషేక్‌ సింఘ్వీ .. మమతా బెనర్జీ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి వాదనలు వినిపిస్తున్నారు. అయితే అధిర్‌ రంజన్‌కు ఈ వ్యవహారం అస్సలు నచ్చలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కేంద్ర బలగాలను మోహరింపజేయటమే సరైందంటూ కోల్‌కతా హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేసి స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు.

అంతేకాదు సింఘ్వీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేసేందుకు రంజన్‌ సిద్ధమైపోయారు. బీజేపీ-తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు విగ్రహ విధ్వంసాలు.. కొట్లాటలతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమే పంచాయితీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని అధిర్‌ వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల పంచాయితీ రాహుల్‌ దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది.   (కాంగ్రెస్‌పై మమత సంచలన వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు