అలాంటి శాసన మండలి అవసరమే లేదు: ఎమ్మెల్యే రోజా

27 Jan, 2020 10:05 IST|Sakshi

సాక్షి, అమరావతి:  పెద్దల సభ అంటే సూచనలు ఇవ‍్వాలి గాని, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఆమె సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్‌ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్‌ అని ఎద్దేవా చేశారు. పెద్దల సభను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పునరుద్దరిస్తే...శాసనమండలిలో ఇవాళ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

మూడు రాజధానుల బిల్లుపై వారి తీరు చూస్తుంటే... చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని అన్నారు. పెద్దల సభ అంటే అందరూ గౌరవించేలా ఉండాలే కానీ, శాసనమండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని, మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను  గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లును అగౌరపరిచారని, అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. 

‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల  బెస్ట్ సీఎం సర్వేలో 4వ  స్థానంలో జగన్‌గారు ఉన్నారు. ఆయన పనితీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలతో బేరసారాలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అలాంటి అవసరమే లేదు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు’  అని చురకలు అంటించారు.

మరిన్ని వార్తలు