ఒపీనియన్‌ పోల్స్‌ : మూడు రాష్ట్రాల్లో బీజేపీకి బిగ్‌ షాక్‌

7 Oct, 2018 16:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ న్నికలు జరిగే మూడు కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయాలతో సత్తా చాటనుందని తాజా ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఏబీపీ న్యూస్‌-సీ ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి కీలక రాష్ట్రాల్లో ఓటమి తప్పదని స్పష్టమైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీర్ఘకాలంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీని రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓడిస్తుందని ఈ సర్వే అంచనా. వేసింది. రాజస్ధాన్‌లో ఓటర్లు సీఎం పదవికి కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ సచిన్‌ పైలట్‌ వైపు అత్యధికంగా మొగ్గు చూపారు.

కాగా 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే స్ధితిలో ఉందని ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించాయి. రాజస్ధాన్‌లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో నెలకొనడంతో అక్కడ కాంగ్రెస్‌ సులభంగా విజయం సాధించనుందని సర్వే అంచనా వేసింది. ఇక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో ఇరు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో కొద్దిపాటి తేడా ఉన్నా కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు ఉండటంతో అధికార పగ్గాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది సర్వే అంచనా.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 142 స్ధానాలు దక్కుతాయని, బీజేపీ కేవలం 56 స్ధానాలకు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. యువనేత సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న ఓటర్లు 36 శాతం కాగా, ప్రస్తుత సీఎం వసుంధరా రాజేకు  27 శాతం ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను సీఎంగా 24 శాతం మంది కోరుకుంటున్నారు.


మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో..
 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు122 స్ధానాలు దక్కుతాయని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మేజిక్‌కు ఫిగర్‌ను దాటి 47 స్ధానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 108, 40 స్ధానాలకు పరిమితమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌లనే తదుపరి సీఎంలుగా ఎక్కువ మంది ఓటర్లు కోరుకోవడం గమనార్హః.

కాంగ్రెస్‌, బీజేపీలకు మధ్యప్రదేశ్‌లో వరుసగా 42.2 శాతం 41.5 శాతం ఓట్లు దక్కువచ్చని, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సర్వే అంచనా వేసింది. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 49.9 శాతం, బీజేపీకి 34.3 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 7 మధ్య ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు