భీమా-కోరేగావ్‌ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

14 Mar, 2018 19:02 IST|Sakshi

పుణె: ఈ జనవరి ఒకటో తేదీన చోటుచేసుకున్న భీమా-కోరేగావ్‌ ఘటనలో ప్రధాన నిందితుడు మిలింద్‌ ఎక్‌బోతేను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్‌బోతే ముందస్తు బెయిల్‌కు చేసుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం నిందితుల్ని పట్టుకోకుండా వారికి కొమ్ము కాస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. 

విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఘటన సందర్భంగా నమోదైన చిన్న చిన్న కేసుల్ని ఉపసంహరించుకున్నామని సర్కార్ ప్రకటించింది. తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు అడిషనల్‌ డీజీపీతో కమిటీ వేస్తున్నట్లు తెలిపింది. ఆ ఘటనలో జరిగిన రూ.13 కోట్ల ఆస్తుల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించింది.

హిందుత్వ నినాదాలతో దాడి..
భీమా-కోరేగావ్‌ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న దాడి జరిగింది. కొందరు హిందూత్వ నినాదాలు చేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. ‘సమస్త హిందూ ఏక్తా అఘాదీ’ ఛీఫ్‌ మిలింద్‌ ఎక్‌బోతే అతని అనుచరులు ఈ దాడికి నేతృత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డ విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు