లోక్‌సభ బరిలోకి విద్యావేత్త సామంత

25 Mar, 2019 13:25 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : సమాజంలో వెనకబడిన బడుగు వర్గాల విద్యావృద్ధిని కాంక్షించి ‘కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ (కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోసల్‌ సైన్సెస్‌ (కేఐఎస్‌ఎస్‌)’ ఉన్నత విద్యా సంస్థల స్థాపన ద్వారా విద్యారంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆధునిక విద్యావేత్త డాక్టర్‌ అచ్యుత సామంతకు తగిన గుర్తింపు లభించింది. స్నేహశీలిగా, మృదుభాషిగా, ఎస్సీ, ఎస్టీల విధాతగా ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు పార్టీ తరఫున కంధమాల్‌ లోక్‌సభ సీటును బీజూ జనతా దళ్‌ (బీజేడీ), ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కేటాయించారు. ఇంతకుముందు ఆయన బీజేడీ తరఫునే రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. గతంలో సామాజిక రంగానికే పరిమితమై ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేసిన సామంత మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దళితులు ఎక్కువగా ఉన్న కంధమాల్‌ లోక్‌సభ సీటును తనకు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయకుండా దళితులు, క్రైస్తవుల సామాజికాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆరు నెలల క్రితం క్రిస్టియన్‌ బాల బాలికల కోసం ‘కిస్‌’ బ్రాంచ్‌ను ఈ నియోజక వర్గంలో ప్రారంభించారు. కంధమాల్‌లో దళితులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వ్‌డ్‌ సీటుకాదు. దళితులు, క్రైస్తవులకు పెన్నిదిగా, హిందువులకు స్నేహశీలిగా అన్నివర్గాల ప్రజలను ఆకర్షిస్తున్న అచ్యుత సామంతే అన్ని విధాల పోటీకి అర్హుడని భావించి ఆయన్ని లోక్‌సభ బరిలోకి పట్నాయక్‌ దించారు. విద్యావేత్తగా, సామాజిక విశిష్ట సేవకుడిగా సామంతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి.

మరిన్ని వార్తలు