మనిషనే వాడు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారా?

21 Mar, 2019 08:52 IST|Sakshi

వాళ్లు అసలు మనుషులేనా: గౌతమి

ఆ పార్టీలు ప్రజల్ని పట్టించుకోవడం లేదు

సాక్షి, పెరంబూరు: తమిళనాట రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ బురద జల్లుకుంటున్నారే కానీ, ప్రజల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని సీనియర్‌ నటి గౌతమి విమర్శించారు. నటుడు కమల్‌హాసన్‌తో సహజీవనం చేసిన గౌతమి కొంతకాలం తరువాత భేదాభిప్రాయాల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవల వివిధ సేవలతో ప్రజాక్షేత్రంలో ఎక్కువగా ఉంటున్నారు. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో గౌతమి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం జరిగింది. 

ఈ సందర్భంగా ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమి పేర్కొంటూ ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన సంఘటన మనసును కలచి వేసిందన్నారు. అసలు మనిషనే వాడు అలాంటి అఘాయిత్యాలకు ఎలా పాల్పడతాడో అని వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘటన బాధితులతో పాటు వారి తల్లిదండ్రులను జీవితాంతం బాధిస్తుందన్నారు. ఆ యువతులు త్వరగా కోలుకుని ధైర్యంగా బాహ్య ప్రపంచంలోకి రావాలన్నారు. ఇలాంటి అరాచకానికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. (తమిళనాడులో ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు 10 సభ్యుల గల ఈ ముఠా  అయిదు వందలమందికి పైగా అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురి చేస్తోంది. వారిపై అత్యాచారాలు చేసి, వీడియోలు చిత్రీకరించి వారిపై  బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోంది. గత ఏడేళ్లుగా వీళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ విద్యార్థిని ధైర్యంగా ముందుకొచ్చి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది.)  

మీరు ఆ మధ్య ప్రధానిని కలవడంతో రాజకీయ  రంగప్రవేశం చేస్తారనే ప్రచారం జరిగిందని,  మీకు అలాంటి ఆసక్తి ఉందా? అన్న ప్రశ్నకు తనకు రాజకీయాల కంటే చేయాల్సిన ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు గౌతమి బదులిచ్చారు. ప్రధానిని కలిసింది తన ఫౌండేషన్‌ కార్యక్రమాల గురించి వివరించడానికి, సలహాలు,  సూచనలు తెలుసుకోవడానికేనని చెప్పారు. మోదీమంచి పథకాలను అమలు చేస్తున్నారని, అయితే వాటిని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని గౌతమి అన్నారు. 

తమిళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, ఆరోపణల బురద జల్లుకుంటున్నారేగానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని జయించిన వనితగా ఆమె తనకు చాలా నచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే జయలలిత మృతిపై తనకే కాకుండా కోట్లాది మంది ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని నటి గౌతమి అన్నారు.  

చదవండి....

భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు

పొల్లాచ్చి కేసు : మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు

మృగాళ్లను కాల్చిచంపాలి

పొల్లాచ్చి ఘటనపై మండిపడుతున్న విద్యార్థిలోకం

మరిన్ని వార్తలు