మోదీని గద్దె దించడమే లక్ష్యం : కుష్బూ

12 Nov, 2018 08:12 IST|Sakshi

పెరంబూరు: ప్రధానమంత్రి మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు ఏక తాటిపైకి వస్తున్నాయని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ పేర్కొన్నారు. ఈమె ఒక ప్రకటనలో పేర్కొంటూ మోదీ పాలన తప్పుడు విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని, మోదీ సర్వాధికారిగా ప్రవర్తిస్తున్నారని రిజర్వుబాంకు గవర్నర్‌ రఘురాంరాజన్‌ చేసిన వ్యాఖ్యలను కుష్బూ గుర్తు చేశారు. మన్‌మోహన్‌సింగ్, చిదంబరం వంటి ఆర్థికనిపుణులు మొదటి నుంచి ఇదే చెబుతున్నారని అన్నారు. వారి కంటే మోది, జైట్లీ, అమిత్‌షా ఆర్థికవేత్తలా అంటూ విమర్శంచారు.

పెద్ద నోట్ల రద్దు వంటి అనాలోచన నిర్ణయాలతో చిరు వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు బాధింపునకు గురయ్యారని అన్నారు. అందుకే మోది దుష్ట పాలనకు చరమగీతం పాడాలని, మళ్లీ అధికారంలోకి రాకూడదనే దేశంలోని కాంగ్రెస్‌ పార్టీ సహా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. ఈ కూటమిలో ప్రధానమంత్రిని ఎంపిక చేయడంలో సమస్యలు తలెత్తవా? సుస్థిర పాలనను అందించడం సాధ్యమా? అన్న ప్రశ్నలకు తావేలేదన్నారు. మొదట మోదీ దుష్ట పాలనను పారదోలాలన్న ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయని అన్నారు. ఇక రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్‌ వాదుల బలమైన ఆకాంక్ష అని, ఈ విషయమై నాయకులందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసన్‌కు, మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్‌కు మధ్య వివాదం గురించి పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని, దానిగురించి తాను మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. అయినా ఇక్కడ విషయాలన్ని రాహుల్‌గాంధీకి తెలుసని, అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగనుండడంతో ఆయా రాష్ట్రాల ప్రసార కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ బిజీగా ఉన్నారని, అవి ముగిసిన తరువాత ఆయన తమిళ రాజకీయాలపై దృష్టిసారిస్తారని కుష్బూ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు