రాజకీయాలు మాట్లాడిన సుహాసిని

4 Oct, 2017 21:55 IST|Sakshi

సాక్షి, చెన్నై : రాజకీయాలకు, సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడులో అయితే అది కాస్త ఎక్కువే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ కొన్ని దశాబ్దాలుగా సినిమా వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాగా జయ మరణం అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం సినిమా వాళ్లే ప్రయత్రాలు ముమ్మరం చేస్తున్నారు. 

విశ్వనటుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తమ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారు?, ఎవరు రాణిస్తారోనన్న ఆసక్తి తమిళ ప్రజలతో పాటు దేశమంతటా నెలకొంది. ఇదిలా ఉంటే సినీ మహిళాలోకం మరో పక్క కదులుతోంది. రాజకీయాలకు తామేమీ తక్కువ కాదంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక కార్యక్రమంలో నటి సుహాసిని మణిరత్నం బాహాటంగానే వెల్లడించారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందిస్తూ.. హీరోలే రాజకీయాల్లోకి రావాలా, తాము రాజకీయాల్లోకి రాకూడదా? అంటూ ప్రశ్నించారు. 

నటీమణులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని నటి సుహాసిని మణిరత్నం వ్యాఖ్యానించారు. దీంతో నటులకే కాదు నటీమణులకు పొలిటికల్ ఫీవర్ పట్టుకుందంటూ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు