కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై

11 Sep, 2019 05:06 IST|Sakshi

అదే బాటలో మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌

ముంబై: బాలీవుడ్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్‌ ఊర్మిళ మటోండ్కర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు.  ముంబై కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు.  

ఊర్మిళ రాసిన లేఖ వెలుగులోకి  
కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు అంత దారుణంగా ఓడిపోయిందో, దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఊర్మిళ మే 16న ముంబై కాంగ్రెస్‌ అప్పటి అధ్యక్షుడు మిలింద్‌ దేవరాకు లేఖ రాశారు. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖ మీడియాలో ప్రచారం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ‘‘కాంగ్రెస్‌ పార్టీ నన్ను నిలువునా మోసం చేసింది. పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న వర్గ పోరుతో నన్ను బలిపశువును చేయాలని చూశారు‘‘అంటూ ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సంజయ్‌నిరుపమకు అత్యంత సన్నిహితులైన సందేష్‌ కోండ్‌విల్కర్‌ , భూషణ్‌ తీరుతెన్నులపై ఊర్మిళ ఆ లేఖలో విమర్శించారు.

గత మార్చిలో కాంగ్రెస్‌ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. తన ఓటమికిగల కారణాలను ఊర్మిళ ఆ లేఖలో వివరిస్తూ స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. మొత్తంగా చూస్తే పార్టీ నేతల్లో నిజాయితీ, సమర్థత, సమన్వయం కొరవడ్డాయని అందుకే తనతో సహా పార్టీలో చాలా మంది ఓటమి పాలయ్యారని ఊర్మిళ ఆ లేఖలో పేర్కొన్నారు. పేర్లతో సహా రాసిన ఆ లేఖను అత్యంత గోప్యంగా ఉంచాల్సింది పోయి మీడియాలో ప్రచారం కావడంతో చివరికి ఆమె పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు