చింతమనేని కండకావరం తగ్గిస్తాం

21 Feb, 2019 13:01 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

 ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం: ‘‘చింతమనేని..నీకండకావరం తగ్గిస్తాం, ఆ రోజులు దగ్గరపడ్డాయి, దళితులంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నావు’’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన తీవ్రవ్యాఖ్యలకు ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌ ఆవేశపూరితంగా మాట్లాడారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. సమన్యాయం చేయాల్సిన సీఎం దళితులపట్ల చిన్నచూపు, అవమానకరంగా మాట్లాడుతుంటే తామేమీ తక్కువకాదని ఎమ్మెల్యేలు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. చింతమనేని గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి చర్యలకు పాల్బడ్డారని, అయినా సీఎం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌ వనజాక్షి జుట్టుపట్టుకొని ఈడ్చితే, చింతమనేనిపై సీఎం చర్యలు తీసుకోకుండా తహశీల్దార్‌తోనే క్షమాపణ చెప్పించారని ఆయన విమర్శించారు. 

ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ పెద్దలు దళిత, బలహీన, మైనార్టీ వర్గాలపై మాయ ప్రేమ చూపిస్తూనే వారిని కించపరుస్తున్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే ఈ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో పేదల అభ్యున్నతికి ఏరోజూ వారు పాటు పడలేదని,  ప్రజా కోర్టులో ఊడ్చుకొనిపోయే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో టీడీపీకి నామరూపాలు లేకుండా చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చింతమనేని చేస్తున్న వ్యాఖ్యలకు టీడీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఎందుకు స్పందించడంలేదని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చింతమనేనిని ఎందుకు నిలదీయరని, సీఎం వద్దకు ఎందుకు వెళ్లలేరని ఆయన ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, ఎన్నికల ముందే కేసును ఒక తుదిరూపుకు తీసుకొని రావాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు. చింతమనేనిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని ఆయన ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.  రాజ్యాంగాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆయా  కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర బీసీ, యువజన విభాగాల కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు