ఆస్తుల్లో ముందున్న బీజేపీ

1 Aug, 2019 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఆస్తులు 22.27 శాతం పెరిగాయి. 2016-17లో  రూ 1213.13 కోట్లుగా నమోదైన కాషాయ పార్టీ ఆస్తులు 2017-18లో రూ.1483.35 కోట్లకు ఎగబాకాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఆస్తులు 15.26 శాతం మేర క్షీణించి రూ 854 కోట్ల నుంచి రూ 724 కోట్లకు పడిపోయాయి. ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్‌ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో ఎన్సీపీ ఆస్తులు రూ 11.41 కోట్ల నుంచి రూ 9.54 కోట్లకు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులను ఏడీఆర్‌ విశ్లేషించింది.

ఏడు పార్టీలు ఈ రెండేళ్ల కాలానికి ప్రకటించిన ఆస్తుల్లో ఆరు శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆస్తులు రూ 26.25 కోట్ల నుంచి రూ 29.10 కోట్లకు ఎగిశాయి. కాగా ఇదే కాలానికి ఏడు రాజకీయ పార్టీల మొత్తం అప్పులు రూ 514 కోట్ల నుంచి రూ 374 కోట్లకు తగ్గడం గమనార్హం. 2017-18 సంవత్సరానికి కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా రూ 324.2 కోట్ల రుణాలున్నట్టు ప్రకటించగా, బీజేపీ రూ 21.38 కోట్లు, తృణమూల్‌ రూ 10.65 కోట్లు అప్పులుగా చూపాయి. రాజకీయ పార్టీలు వాణిజ్యేతర, పరిశ్రమేతర క్యాటగిరీలో ఉండటంతో ఇతర సంస్థలకు వర్తించే సాధారణ అకౌంటింగ్‌ ప్రక్రియలు పార్టీలకు వర్తించవని ఏడీఆర్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు