‘సీబీఐని నిరోధించే అధికారం లేదు’

16 Nov, 2018 13:15 IST|Sakshi
ఎంఎల్‌ శర్మ (ఫైల్‌ ఫొటో)

మీడియాతో సుప్రీం కోర్టు న్యాయవాది ఎం.ఎల్‌ శర్మ

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు న్యాయవాది ఎం.ఎల్‌ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐని పూర్తిగా నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఉండదన్నారు. కేసులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నియంత్రణ విధించవచ్చని, కానీ ఏకమొత్తంగా సీబీఐని నిరోధించడం సాధ్యం కాదన్నారు. షెడ్యూల్‌ 7ఏ ప్రకారం సీబీఐపై పార్లమెంట్‌కు అధికారం ఉందని, ఇది రాజ్యంగ పరమైన సంక్లిష్ట సమస్యగా ఈ జీవోను కోర్టు కొట్టేస్తుందని పేర్కొన్నారు. 

షెడ్యూల్‌ 7 ప్రకారం కేంద్రానికి సీబీఐపై అధికారం ఉదని, పార్లమెంట్‌ చట్టానికి వ్యతిరేకంగా కన్సెండ్‌ ఇవ్వడానికి వీలులేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఈ కేసును చాలా సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 6 కొట్టివేయాలని సుప్రీంకోర్టులో  సోమవారం కేసు వేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిషేధం విధిస్తుందో కారణాలు చెప్పాలని, సుప్రీంకోర్టు ఈ విషయాల్లో తప్పనిసరిగా డైరెక్షన్స్ ఇస్తుందన్నారు. ఈ జీవోను నిరోధిస్తూ తక్షణమే కేంద్రం ఆర్డినెన్సు తీసుకురావాలన్నారు. టీడీపీ ఎంపీ పై ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయని, ఈ నేపథ్యంలోనే భయంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుందన్నారు.

చదవండి: ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ

మరిన్ని వార్తలు