అందుకే అడ్వాణీకి సీటు ఇవ్వలేదట..!

22 Mar, 2019 12:14 IST|Sakshi

2019 లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ ప్రముఖుల జాబితాలో బీజేపీ కురువృద్ధుడు అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ (91) పేరు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రాజకీయ జీవితానికి తెరపడినట్టేనా అనంటూ పరిశీలకులు కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఆయన వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని మీడియాతో వెల్లడించారు.

అడ్వాణీతో చర్చించిన అనంతరమే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని గడ్కరీ తెలిపారు. అయినా పార్టీ సీనియర్‌గా అడ్వాణీ సదా ప్రేరణగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో అయినా సమయానుకాలంగా కొన్నిమార్పులు అనివార్యమవుతాయనీ, ఈ క్రమంలోనే పార‍్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఎప్పటికీ తమకు గౌరవనీయమైన నేతగానే ఉంటారని, ఆయన ఆశీర్వాదం పార్టీకి ఉంటుందన్నారు. అంతమాత్రాన ఆయనకు కావాలనే టికెట్‌ ఇవ్వలేదనే విమర్శలు సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య కారణాల రీత్యా తాను ఈ సారి లోక్‌సభకు పోటీ చేయడం లేదంటూ విదేశాంగ మంత్రి సుష్మా  స్వరాజ్‌ ప్రకటించిన అంశాన్ని గడ్కరీ గుర్తు చేశారు.

మరోవైపు నాగపూర్‌లో తాను అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని గడ్కరీ ప్రకటించారు. గత అయిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి నేపథ్యంలో దాదాపు నాలుగన్నర లక్షల ఓట్ల మెజారిటీ తనకు లభిస్తుందనే విశ్వాసాన్ని గడ్కరీ  వ్యక్తం చేశారు.

కాగా 184 మందితో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో పార్టీ పితామహుడుగా భావించే అడ్వాణీ పేరు విస్మరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గాంధీనగర్‌ నియోజకవర్గంలో ఆయన స్థానంలో పోటీచేస్తున్న అమిత్‌ షా తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు