దేశ భవిష్యత్‌ కోసమే మళ్లీ కలిశాం: మాయావతి

19 Apr, 2019 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న‌ది నానుడి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ... 24 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ మణిపూరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. 

ములాయం సింగ్‌ యాదవ్‌ తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన వర్గాలకు ములాయం రియల్‌ హీరో అని, అంతేకాకుండా మొయిన్‌పురిలో ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. దేశ భవిష్యత్‌ కోసమే విభేదాలు పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయని మాయావతి తెలిపారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాటకాలు, అబద్దాలు పని చేయవన్నారు. ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలకు మోదీ చేసిందేమీ లేదని మాయావతి విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ ఆలోచిస్తాయని, తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలు, పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆమె హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు. ఇక ములాయం సింగ్‌కు సరైన వారసుడు అఖిలేష్‌ యాదవే అని మాయావతి పేర్కొన్నారు.

మరోవైపు మాయావతి తనకు మద్దతుగా ప్రచారం చేయడంపై ములాయం సింగ్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లీ మాయావతితో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన ఎస్పీ - బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకనాటి ప్రత్యర్థి పక్షాలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ఈ రెండు పార్టీలు యూపీలోని 80 సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు