34సార్లు ఓడిపోయాడు.. ఐనా!

7 Apr, 2019 16:36 IST|Sakshi

భువనేశ్వర్‌: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఎన్నికలు ఏదైనా ఆయన పోటీ చేయాల్సిందే. 1962 నుంచి ఒడిశా బెర్హంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. ఓటమి ఆయనను ఏనాడూ ఆపలేదు. నిరుత్సాహ పరచలేదు. నిజానికి ఎన్నికల్లో ఇప్పటికీ 32సార్లు ఆయన ఓడిపోయాడు. అయినా, ఈసారి ఒకటి కాదు రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనే ఒడిశా ఎన్నికలకు బాగా సుపరిచితుడైన శ్యాంబాబు సుబుద్ధి. 84 ఏళ్ల వయస్సులో తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుబుద్ధి.. ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీతో ముచ్చటించారు.

‘నేను మొదటిసారి 1962లో ఎన్నికల్లో పోటీ చేశాను. అప్పటినుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఇలా భిన్నమైన ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేస్తూ వస్తున్నాను. తమ పార్టీలో చేర్సాలిందిగా పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. కానీ, నేను ఎప్పుడూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తూ వచ్చాను’ అని తెలిపారు. సర్టిఫైడ్‌ హోమియోపతి డాక్టర్‌ అయిన సుబుద్ధి ఈసారి ఆస్కా, బెర్హంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అంతేకాదు, జూన్‌ 11న ఒడిశాలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం బీజు పట్నాయక్‌లపై కూడా ఆయన పోటీ చేశారు.

‘రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటాను. మార్కెట్లు, కూడళ్లలోనూ ప్రచారం చేస్తాను. గెలుపోటములు నాకు ముఖ్యం కాదు. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఈసారి ఎన్నికల గుర్తుగా నాకు క్రికెట్‌ బ్యాటును కేటాయించారు. అందుకే పీఎం అభ్యర్థి అని రాసి ఉన్న బ్యాటును ప్రచారంలో ఉపయోగిస్తున్నాను’ అని సుబుద్ధి వివరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, మద్యం పంపిణీ వంటి చర్యలు తనను తీవ్ర అసంతృప్తి గురి చేస్తున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని సుబుద్ధి చెప్పారు.

చదవండి: ఎన్నికల్లో పోటీ.... ఆయన హాబీ!

>
మరిన్ని వార్తలు