మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం..

12 Apr, 2019 17:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ రౌడీయిజం చేసిందని ఆయన అన్నారు. పోలింగ్‌ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను చాటి చెబుతోందని, అందుకే బాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. మే 23న చంద్రబాబు మాజీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంబటి రాంబాబు శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘సాక్షాత్తు చంద్రబాబు ఈసీ అధికారినే బెదిరించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కొనేశారని మతి లేకుండా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయలేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంలు పని చేయకపోతే పోలింగ్‌ శాతం ఎలా పెరిగింది. చంద్రబాబు కుట్ర భగ్నమైందనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అధికారం  పోతుందన్న ఆలోచనే చంద‍్రబాబును భయపెడుతుంది. ఆయనకు గెలుస్తామన్న విశ్వాసం ఉంటే భయమెందుకు?. ఓటమి భయంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారు. చాలాచోట్ల మా పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. టీడీపీ నేతలే దాడులు చేసి తిరిగి మాపైనే నెడుతున్నారు. కోడెల శివప్రసాదరావుపై మా పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదు. కోడెల పోలింగ్‌ కేంద్రానన్ని క్యాప్చరింగ్‌ చేసే వ్యక్తి. క్రిమిననల్‌ మైండ్‌తో రాజకీయాలు చేయడం కోడెలకు అలవాటు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. బూత్‌లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. 

గత ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంలతో గెలవలేదా?. ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు ఈవీఎంలు పనికి రాలేదా?. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మే 23న తెలుస్తోంది. ఇక మంగళగిరిలో కూడా లోకేష్‌కు ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అంటారు. గెలిచాక కంట్లో కారం కొడతారని మహిళలకు తెలుసు. అందుకే చంద్రబాబు రాక్షస పాలన అంతమొందించటానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు