రాజీనామా వెనక్కి తీసుకుంటా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

13 Jul, 2019 16:47 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధంకావడంతో.. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించి.. మళ్లీ తన శిబిరంలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెబల్ ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజుతో కాంగ్రెస్ సీనియర్లు జీ. పరమేశ్వర, డీకే శివకుమార్‌ చర్చలు జరిపారు. గత అర్ధరాత్రి నుంచి నాగరాజు నివాసంలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చలు ఫలించాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు అంగీకరించారు. అంతేకాకుండా శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు సిద్దరామయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని, కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజీనామా ఉపసంహరించుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నాని, మరో రెబల్ ఎమ్మెల్యే సుధాకర్‌తోనూ రాజీనామా వెనక్కి తీసుకునే విషయం చర్చిస్తున్నానని ఆయన తెలిపారు. 



40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాగరాజు కాంగ్రెస్‌కి వీధేయుడని.. ఆయన పార్టీలోనే కొనసాగుతారని ఈ సందర్భంగా సీనియర్‌ మంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు. ఆయన తిరిగిరావడంతో తమకు కొండంతబలం వచ్చినట్టుందన్నారు. నాగరాజు, సుధాకర్‌తోపాటు మరికొంతమంది రెబెల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించడం ద్వారా విశ్వాస పరీక్ష గండాన్ని గట్టెక్కాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ పెద్దలు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు