బురద జల్లడమే వారి పని

26 Sep, 2018 01:55 IST|Sakshi
భోపాల్‌లో నిర్వహించిన సభలో వేదికపై నుంచి అభివాదం చేస్తున్న మోదీ, అమిత్‌ షా

అభివృద్ధిపై చర్చకు మాత్రం ముందుకు రారు

రాఫెల్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలపై ప్రధాని పరోక్ష స్పందన

సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించే స్థాయికి ఆ పార్టీ దిగజారిందని వ్యాఖ్య

భోపాల్‌: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌ను విమర్శించారు. అభివృద్ధిపై చర్చించడం కన్నా వారికి బురద జల్లడమే తేలికైన పని అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే, ఎంత బురదజల్లితే కమలం అంత వికసిస్తుందని, ఇన్నాళ్లూ అదే జరిగిందని వ్యాఖ్యానించారు. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ ఆరోపణల జోరు పెంచిన నేపథ్యంలో పరోక్షంగా ప్రధాని తొలిసారి స్పందించడం గమనార్హం.

జెట్‌ గేట్‌(రాఫెల్‌ డీల్‌) కుంభకోణాన్ని సరిగ్గా ప్రచారం చేస్తే భారత్‌ తదుపరి ప్రధాని రాహుల్‌ గాంధీనే అంటూ పాకిస్తాన్‌ మాజీ హోంమంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇప్పుడు విదేశాల నుంచి మద్దతు కోసం చూస్తోందని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. ‘మన తదుపరి ప్రధాని ఎవరనేది వేరే దేశాలు నిర్ణయిస్తాయా?’ అని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌ పరిస్థితి ఎంత దిగజారిందంటే.. ఇప్పుడా పార్టీని సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలం’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు చిన్నాచితక పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.

ఎంత బురద జల్లితే.. అంత వికసించాం
‘అధికారం కోల్పోయాక కాంగ్రెస్‌లో సమతౌల్యం లోపించింది. అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతోంది. కానీ నేను వాళ్లకు ఒక్కటే చెప్పదలచుకున్నా. మీరు ఎంతగా బురద జల్లితే కమలం(బీజేపీ గుర్తు) అంతగా వికసించింది. అభివృద్ధిపై చర్చకు రావాలని ఆహ్వానించినా వారు రాలేదు. ఎందుకంటే బురద జల్లటమే సులభమని భావిస్తున్నారు. 2001లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీ శక్తినంతా కూడదీసుకుని తిడుతూనే ఉన్నారు.

ఇక తిట్టడానికి డిక్షనరీలో కూడా పదాల్లేవు’ అని అన్నారు.  స్వదేశంలో విపక్షాల కూట మి ఏర్పాటులో విఫలమైన కాంగ్రెస్‌ విదేశాల మద్దతు కోసం చూస్తోందన్నారు. ‘దురహంకారంతో బలహీనపడి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న 125 ఏళ్ల పార్టీలో ఇప్పుడే మీ మిగల్లేదు. సూక్ష్మదర్శినితోనే కాంగ్రెస్‌ను చూడగలం’ అని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలుగా తనని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్‌ పన్నిన కుయుక్తులు ఫలించలేదన్నారు.

చెదపురుగుల్లా ఓటుబ్యాంకు రాజకీయాలు
దేశానికి కాంగ్రెస్‌ భారంగా మారిందని, ఆ పార్టీ నుంచి భారత్‌ను కాపాడే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సమాజాన్ని చెదపురుగుల్లా నాశనం చేస్తున్నాయని, ఆ పీడ నుంచి దేశాన్ని కాపాడుకోవడం మ నందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి పాటుపడకుండా, వారి కుర్చీ ని కాపాడుకోవడానికి కొందరు సమాజాన్ని విభజించారన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ..మహిళా(సోనియా గాంధీని ఉద్దేశించి) నేతృత్వంలోని పార్టీయే ముస్లిం మహిళల బాగోగులపై శ్రద్ధచూపడంలేదని, ఈ వైఖరి ఓటుబ్యాం కు రాజకీయాల వికృతరూపమన్నారు.

మరిన్ని వార్తలు