కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం

17 Dec, 2018 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు భారీ వ్యత్యాసం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పరిస్థితిపైనే ఆధారపడి ఉంటాయన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయని, కేంద్రంలో ప్రధాని మోదీకే భారతీయులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని, యువత, రైతులు బీజేపీకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. దేశ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో మోదీని మించిన నాయకుడు లేరని కొనియాడారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, భారీ మొత్తంలో ధాన్యం తడవడంతో వాటి కొనుగోలుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు