‘సహకారం’   79.36 శాతం

16 Feb, 2020 03:21 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ

ఓటు హక్కు వినియోగించుకున్న 9.11లక్షల మంది 

నేడు చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

రేపు డీసీసీబీ అధ్యక్షుల నియామక నోటిఫికేషన్‌

ఈ నెల 24 నాటికి డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక

29న టెస్కాబ్‌ చైర్మన్‌ ఎలక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్యాక్స్‌లకు (వాటిల్లోని 6,248 డైరెక్టర్‌ పదవులు) జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం ఓటింగ్‌ జరిగినట్లు వెల్లడించింది. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 89.82 శాతం ఓటింగ్‌ జరిగింది. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 87.99 శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఎన్నికల అథారిటీ వెల్లడించింది. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో కేవలం 55.78 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.48 లక్షల మంది ఓటర్లకుగాను, 9.11 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 906 ప్యాక్స్‌లకుగాను 904 పరిధిలోని 11,653 డైరెక్టర్‌ స్థానాలకు (ప్రాయోజిత నియోజకవర్గాలు) సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తరువాత 157 ప్యాక్స్‌లు... వాటిల్లోని 2,017 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే మిగిలిన ప్యాక్స్‌ల్లోని మరికొన్ని స్థానాలు.. అంటే 3,388 డైరెక్టర్‌ స్థానాలు కూడా ఏకగీవ్రమయ్యాయి. మొత్తంగా 5,405 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మిగిలిన 6,248 డైరెక్టర్‌ స్థానాలకు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మొత్తం 14,530 మంది పోటీపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించారు. డైరెక్టర్లు ఎవరో తేలిపోయింది.

నేడు చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక... 
డైరెక్టర్లుగా ఎన్నికైన 11,653 మంది 904 ప్యాక్స్‌లకు చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఆదివారం ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. చైర్మన్, వైస్‌ చైర్మన్లను చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం జిల్లా కలెక్టర్లు వారి పేర్లను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీకి పంపిస్తారు. ఆపై వారి పేర్లను అధికారికంగా వెల్లడిస్తారు. ప్యాక్స్‌ చైర్మన్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదికనే డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 24 నాటికి డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది. డీసీసీబీ అధ్యక్షులు టెస్కాబ్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

టెస్కాబ్‌ చైర్మన్‌ ఎన్నికను ఈ నెల 29 నాటికల్లా పూర్తిచేస్తారు. దీంతో మొత్తం సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో అత్యంత తక్కువ సమయంలో ఈ ఎన్నికలను సహకారశాఖ సమర్థంగా నిర్వహించిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్యాక్స్‌ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వాట్సాప్‌ను అత్యధికంగా వినియోగించుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక గ్రూపును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలను వాట్సాప్‌ ద్వారానే జారీ చేసింది. దీంతో సమయం ఎంతో కలసి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు