‘2004’ పునరావృతం అవుతుందా ?

22 Feb, 2019 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ప్రధాన రాజకీయ పక్షాలైన ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీల కూటములు దాదాపు ఖరారయ్యాయి. పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతోని భారతీయ జనతా పార్టీ మంగళవారమే పొత్తును కుదుర్చుకోగా, ప్రతిపక్ష డీఎంకేతోని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నాడు పొత్తును ఖరారు చేసుకొంది. డీఎంకే తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకుగాను తొమ్మిది సీట్లను, పుదుచ్చేరిలోని ఏకైక సీటును కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించింది. 

రెండు లోక్‌సభ సీట్లతో పాటు 21 అసెంబ్లీ సీట్లకు జరుగనున్న ఉప ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లు కోరుతున్న సీపీఎంతో డీఎంకే శుక్రవారం చర్చలు ప్రారంభించింది. రెండేసీ లోక్‌సభ సీట్లను కోరుతున్న సీపీఐ, విదుతలై చిరుతైగల్‌ కాట్చీ, మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీలతో కూడా డీఎంకే చర్చలు జరపనుంది. డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంకే స్టాలిన్‌ ఎదుర్కొంటున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవి. 2018, ఆగస్టులో ఆయన తండ్రి ఎం. కరుణానిధి మరణించాక ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికలు సవాల్‌ విసరనున్నాయి. 

2004లో కాంగ్రెస్, ఎస్‌. రామదాస్‌ నాయకత్వంలోని పట్టాల్‌ మక్కల్‌ కాట్చీ, వైకో నాయకత్వంలోని మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగంతో కలిసి డీఎంకే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 39 సీట్లకుగాను మొత్తం 39 సీట్లను గెలుచుకుంది. 2009 ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అయింది. శ్రీలంక తమిళుల సమస్యపై కాంగ్రెస్‌తో విభేదించి 2013లో యూపీఏ నుంచి డీఎంకే బయటకు వచ్చింది. 2016లో కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా లాభం లేకపోయింది. వాస్తవానికి 2004 సంవత్సరం నుంచే డీఎంకే ఓటు షేరు తగ్గుతూ వస్తోంది. ఆ ఎన్నికల్లో డీఎంకేకు ఏకంగా 50 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2009లో జరిగింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  పార్టీకి ఓటింగ్‌ శాతం 25 శాతానికి పడిపోయింది. 2014లో  జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 23. 4 శాతం ఓట్లకు పరిమితం అయింది. పోలింగ్‌ శాతం కొంతే తేడా ఉన్నప్పటికీ 2009లో 18 సీట్లను గెలుచుకున్నా 2014 ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ఒక్క సీటును కూడా పొందలేక పోయింది. 2009లో 15.3 శాతం ఓట్లతో ఎనిమిది సీట్లను సాధించిన కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లను సాధించిన ఆ పార్టీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు. 

మరోపక్క సార్వత్రిక ఎన్నికల కోసం పీఎంకే, బీజేపీలతో ఏఐఏడీఎంకే పార్టీ ఎన్నికల పొత్తును కుదుర్చుకుంది. పీఎంకేకు రెండు సీట్లను, బీజేపీకి ఐదు సీట్లను కేటాయించింది. ఎస్‌ రామదాస్‌ నాయకత్వంలోని పీఎంకే పార్టీతోని పొత్తు కుదుర్చుకోవడం విశేషం. ఏఐడీఎంకే ప్రభుత్వాన్ని గత రెండేళ్ల నుంచి విమర్శిస్తు వస్తున్న పీఎంకే చివిరి నిమిషంలో బీజేపీ కారణంగా ఆ కూటిమిలో కలిసింది. రాష్ట్రంలో నాలుగు శాతానికన్నా తక్కువ ఓటింగ్‌ శాతం కలిగిన బీజేపీ ఐదు సీట్లకు పొత్తు కుదుర్చుకోవడం కూడా విశేషమే. అయినప్పటికీ మాజీ సినీ నటుడు విజయ్‌కాంత్‌ నాయకత్వంలోని దేశీయ మురుపొక్కు ద్రావిడ కళగంతో పొత్తు చర్చలు కొనసాగిస్తోంది. టీటీవీ దినకరణ్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం, సినీ నటుడు కమల్‌ హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీది మయామ్, సీమన్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కాట్చీ పార్టీలు స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. తమిళనాడు నుంచి పార్లమెంట్‌కు ఇన్ని పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికే ప్రస్తుతం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు