కాంగ్రెస్‌లో ‘సర్వే’ దుమారం

11 Jan, 2019 00:55 IST|Sakshi

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాపై అధిష్టానం ఆగ్రహం!

సత్యనారాయణను హడావుడిగా సస్పెండ్‌ చేయడంపై మండిపాటు

అంతర్గత వ్యవహారం క్రమశిక్షణ కిందకు ఎలా వస్తుందని నిలదీత

ఏఐసీసీ సభ్యుడిని పీసీసీ సస్పెండ్‌ చేయడమేంటని క్లాస్‌

ఆంటోనీని కలసి సర్వే వివరణ, ఉత్తమ్, కుంతియాపై మళ్లీ ఫిర్యాదు

ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యం?

సస్పెన్షన్‌ అంశం పెండింగ్‌లో...  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ సస్పెన్షన్‌ వ్యవహారం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం హడావిడిగా ప్రకటించడంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సర్వే సస్పెన్షన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకొని కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్‌ ఎపిసోడ్‌పై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియాను ఢిల్లీ పిలిపించి మరీ హైకమాండ్‌ వివరణ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

తమను సంప్రదించకుండా సర్వేను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎలా ప్రకటించారని, ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదిక ఏదని కుంతియాను పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎ. కె. ఆంటోనీ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన గాంధీభవన్‌ నుంచి నివేదిక తయారు చేయించి పంపించాల్సి వచ్చింది. అయితే ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు సర్వేను కూడా ఆంటోని ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్‌ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, త్వరలోనే దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అలా ఎలా చేస్తారు..?
ఈ నెల 6న జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో కుంతియా, ఉత్తమ్‌లపై సర్వే సత్యనారాయణ పలు ఆరోపణలు చేశారు. కుంతియాను వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించారని, అడ్డువచ్చిన వారిపై దాడి చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని కాంగ్రెస్‌ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సస్పెన్షన్‌కు ముందు అధిష్టానాన్ని సంప్రదించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో హడావుడిగా ప్రకటన చేసేశారు. దీనిపై అధిష్టానం అభ్యంతరం వ్యక్తం చేసిందని, కుంతియాను వివరణ కోరిన సందర్భంగా ఆయనకు ఆంటోనీ పలు ప్రశ్నలు వేశారనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం క్రమశిక్షణా రాహిత్యం కిందకు ఎలా వస్తుందని, ఎన్నికల ఫలితాల సమీక్ష కోసం పిలిచినందుకే సర్వే సమావేశానికి హాజరై అభిప్రాయం చెప్పినప్పుడు నోట్‌ చేసుకొని తమకు తెలియజేసి ఉంటే ఏం చేయాలో తామే నిర్ణయం తీసుకునేవాళ్లమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న, కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడిని పీసీసీ స్థాయిలో ఎలా సస్పెండ్‌ చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న కుంతియా... వెంటనే గాంధీ భవన్‌ను సంప్రదించి సమీక్ష సమావేశంలో పాల్గొన్న వారి సంతకాలతో కూడిన నివేదికను ఢిల్లీకి తెప్పించుకున్నట్లు తెలిసింది. అయితే మల్కాజిగిరి పార్లమెంటు సమీక్ష జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గంతో సంబంధం లేని వారు వచ్చారని, వారితోనే తనపై దాడి చేయించేందుకు ప్రయత్నించారని సర్వే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వారితోనే సంతకాలు చేయించి పార్టీ అధిష్టానానికి నివేదిక పంపడం చర్చకు దారితీస్తోంది. ఈ ఎపిసోడ్‌ ఇలా ఉంటే గురువారం సర్వే సత్యనారాయణ కూడా ఆంటోనీని కలిశారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు క్రమశిక్షణ కమి టీ పిలవడంతో ఢిల్లీ వెళ్లిన సర్వే... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు కుంతియాపై మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వే సస్పెన్షన్‌ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించారు: సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి కాంగ్రెస్‌ సీని యర్‌ నేత సర్వే సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమిపై రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్య లపై ఆయన గురువారం ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ఏకే ఆంటోనీని కలసి వివరణ ఇచ్చారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్, కుం తియాల తప్పిదాలను ఆంటోనీకి వివరించినట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నించిన ఏఐసీసీ సభ్యుడినైన తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేకపోయినా పీసీసీ అధ్యక్షుడు సస్పెండ్‌ చేశారన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మిత్ర ధర్మాన్ని ఉత్తమ్‌ వమ్ము చేశారని, టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకొని పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పానని వివరించారు. ఉత్తమ్‌ పార్టీకి శనిలా దాపురించి నిండా ముంచారని మండిపడ్డారు. ఉత్తమ్‌ చర్యల వల్ల చంద్రబాబు, ప్రొఫెసర్‌ కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు అందరూ అభాసు పాలయ్యారన్నా రు. ఇబ్రహీంపట్నం లాంటి స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులకు స్థానం కేటాయించకుండా పార్టీకి నష్టం చేకూర్చారని వివరించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు