కుమారికి.. రాహుల్‌ గాంధీ

14 Dec, 2017 11:23 IST|Sakshi

భద్రత కట్టుదిట్టం

సాక్షి, చెన్నై:  కన్యాకుమారిలో ఓఖి బాధితుల్ని పరామర్శించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ వెళ్తున్నారు. గురువారం ఆయన పర్యటన సాగనుండడంతో కుమరిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓఖి ప్రళయ తాండవానికి కన్యాకుమారి సర్వం కోల్పోయిన విషయం తెలిసిందే. కడలిలోకి వెళ్లిన వందలాది మంది జాలర్ల జాడ కాన రాలేదు. ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ఇచ్చినా బాధితులు మాత్రం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్రం తరఫున రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ బాధితుల్ని పరామర్శించి ఓదార్చి వచ్చారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా గుజరాత్‌ ఎన్నికల బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ ప్రస్తుతం కుమరిలో పర్యటించేందుకు నిర్ణయించారు. 

నేడు రాక : ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో పర్యటించనుండడంతో కాంగ్రెస్‌ వర్గాలు ఆయన దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నేతలు కుమరికి బుధవారమే తరలి వెళ్లారు. అయితే, పార్టీ వర్గాలతో  ఎలాంటి పలకరింపులకు అవకాశం లేకుండా, కేవలం బాధిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా రాహుల్‌ కుమరికి వచ్చేందుకు నిర్ణయించారు. ఆ మేరకు తిరువనంతపురం నుంచి హెలికాప్టర్‌లో కుమరి తూత్తురులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పర్యటన సాగనుంది. 

తొలుత చిన్నదురైలో బాధితుల్ని పరామర్శించనున్నారు. ఆ తదుపరి పంట పొలాలు, జాలర్ల గ్రామాల్లో ఆయన పర్యటన సాగనుంది. అలాగే, జాలర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యే విధంగా రాహుల్‌ పర్యటనను రూపొందించారు. రాహుల్‌ పర్యటనతో కుమరిని నిఘా నీడలోకి తెచ్చారు.ఆయన పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తిరునల్వేలి, తూత్తుకుడిల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దించారు. కడలిలోకి వెళ్లిన వారిలో 662 మంది జాలర్ల జాడ ఇంత వరకు కాన రాలేదని, వారి మీద ఆశలు సన్నగిల్లుతున్నట్టు జాలర్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుణనాథన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో బాధితుల్ని ఆదుకోవాలని నినదిస్తూ బుధవారం జాలర్ల కాంగ్రెస్‌ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం జరిగింది.

మరిన్ని వార్తలు