ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే... విషం చిమ్ముతారా..?

9 Jul, 2020 02:03 IST|Sakshi

మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పైన విషం చిమ్ముతోందని మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ సొంత బిడ్డలయిన కాంగ్రెస్‌ పార్టీ నేతలపై విషం చిమ్ముతున్నారని బుధవారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం సచివాలయాన్ని కట్టడం అవసరమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్‌ కుటుంబానికి వాస్తు సరిగా లేదని ప్రజలకు చెందిన వేల కోట్ల ఆస్తులతో భవనాలు నిర్మించడం, దాన్ని మంత్రులు సిగ్గులేకుండా సమర్థించడం దౌర్భాగ్యమని అన్నారు. విభజన చట్టాన్ని తామే తయారు చేశామని కేసీఆర్‌ చెప్పుకున్నారని, మరి ఆ చట్టంలో సెక్షన్‌ 8 ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు చట్టం, రాజ్యాంగం తెలియడం లేదని, చట్టంలో ఉన్నది కాబట్టే తాము అడుగుతున్నామని, అది ఆమలు చేయమని అడగడం బానిసత్వం అవుతుందా అని ప్రశ్నించారు.

మంత్రులకు కనీసం సోయి లేకుండా పోయిందని, చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఉంది కాబట్టే తాము సెక్షన్‌ 8 గురించి అడుగుతున్నామని, అవేమీ మంత్రులకు లేవు కాబట్టి తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ ఎక్కడ ఉంటే ఏందని మంత్రులు అంటున్నారని, కేసీఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల బాగోగులు తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని, ఆ సమయంలో కేసీఆర్‌ కనిపించకుండా పోతే ఎలా అని అన్నారు. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ కరోనా అంటున్నారని, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తాము చేతల్లో చూపించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ కరోనా కాదని, టీఆర్‌ ఎస్‌ పార్టీ ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరమైనదని సంపత్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు