కేసీఆర్‌వి పగటి కలలు: దాసోజు

6 May, 2019 17:59 IST|Sakshi
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌

ఢిల్లీ: ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ ఏదో పగటి కలలు కంటున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దాసోజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కమ్యునిస్టులకు మద్ధతు ఇవ్వరు కానీ.. జాతీయ స్థాయిలో ఉన్న కమ్యునిస్టులతో పొత్తులకు సిద్ధం అంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసం కేసీఆర్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి కేసీఆర్‌ మద్ధతుదారుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సారు..కారు..ఆరు దగ్గరనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఉండి పోతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చేస్తున్న పర్యటనలు రాజకీయా యాత్రల్లా లేవని.. తీర్ధ యాత్రల్లాగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు, కేసీఆర్‌తో వెళ్లలేమని తెగేసి చెబుతున్నారని అన్నారు.

29 శాతం రిజర్వేషన్లు బీసీలకే దక్కాలి
‘ నల్సార్‌ లా యూనివర్సిటీలో తెలంగాణ స్థానిక రిజర్వేషన్లు, 371(డీ) రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 85 శాతం రిజర్వేషన్లు స్థానికులకే దక్కాలి. తెలంగాణ రాష్ట్ర చట్టం ప్రకారం 29 శాతం రిజర్వేషన్లు బీసీలకే దక్కాలి. కానీ చట్టం అమలు కాకపోవడంతో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహా విశ్వవిద్యాలయంలో చట్టం అమలు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?. తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నల్సార్‌కి ఛాన్సలర్‌గా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉన్నా కూడా చట్టం అమలు కావడం లేద’ని లేఖ ద్వారా దాసోజు శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు