ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు

15 Jun, 2019 16:12 IST|Sakshi
ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్‌ కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో దాసోజు శ్రవణ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ఏమై పోతున్నారు’ అనే శీర్షికతో ఈనాడు పేపర్‌లో ఒక వార్త వచ్చింది.. 548 మంది బాలికలు అదృశ్యమయ్యారని ఆ వార్త సారాంశమని పేర్కొన్నారు. ఇలా అదృశ్యమై ఎముకలుగా మారిన పరిస్థితుల్లో హాజీపూర్‌ బాలికల అస్థికలు దొరికాయని గుర్తు చేశారు. బాలికల అదృశ్యం గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వెంకట్‌ గురజాల, మరి కొందరు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఉద్యోగులను ప్రభుత్వం అకారణంగా అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు.

వారిపై వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వార్త ప్రచురించిన ఈనాడు పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదని దాసోజు సూటిగా ప్రశ్నించారు. మాకు తెలంగాణా పోలీసులపైన అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయని అన్నారు. స్వయంగా డీజీపీ కూడా 545 మంది బాలికలు అదృశ్యమయ్యారు.. ఇంకా 318 మంది ట్రేస్‌ అవుట్‌ కాలేదు అని ట్విటర్‌లో ట్వీట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. డీజీపీతో పాటుగా వీరందరిపై కేసు నమోదు చేయకుండా కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు.

అనవసరంగా వారి భవిష్యత్తును కేసులు పెట్టి నాశనం చేయవద్దని కోరారు. ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ.. ఈ రోజు కేవలం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధుల రక్షణ కోసం మాత్రమే పనిచేసేలా తయారైందని విమర్శించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు...వారికి సరైన భద్రత కల్పించాలని కోరారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్థ పనిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు