కశ్మీర్‌ వినాశనంలో బీజేపీ పాత్ర లేదా!

19 Jun, 2018 16:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరుగుతోన్న వినాశనంలో తన పాత్రేమీ లేనట్లు బీజేపీ బొంకడం విడ్డూరంగా ఉందని ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీమాంతర ఉగ్రవాదం పేట్రేగిపోవడం, ఆర్మీ క్యాంపులపై వరుసగా దాడులు, షుజీత్‌ బుఖారీ లాంటివాళ్ల హత్యలు, స్కూళ్లు, కాలేజీల మూసివేత... తదితర పరిణామాలకు సంబంధించి పీడీపీ కంటే బీజేపీనే ప్రధాన ముద్దాయి అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంపై మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: బీజేపీ బ్రేకప్‌.. సీఎం రాజీనామా!)

ముఫ్తీని నిందిస్తే బీజేపీ తప్పులు మాసిపోతాయా?: ‘‘పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని వ్యవహారాలకు మంత్రివర్గానిదే బాధ్యత అన్న కనీస సూత్రాన్ని బీజేపీ మర్చిపోయినట్లుంది. మెహబూబా కేబినెట్‌లో బీజేపీ డిప్యూటీ సీఎం సహా, మంత్రులు కూడా ఉన్నారుగా! గత మూడేళ్లుగా కశ్మీర్‌లో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీ బాధ్యురాలే. ఇప్పుడు సడన్‌గా పీడీపీతో పొత్తుతెంచుకుని, ముఫ్తీని నిందించినంత మాత్రాన బీజేపీ గొప్పదైపోదు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం ప్రారంభమైంది కాబట్టే, కాషాయనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. (చూడండి: ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!)

కశ్మీర్‌ నడిచేది కేంద్రం ఆదేశాలతో కాదా?: పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలిగినందుకు బీజేపీ చెబుతున్న కారణాలేవీ సహేతుకంగాలేవు. కాల్పుల విరమణ, క్రాస్‌ బోర్డర్‌ టెర్రరిజం నియంత్రణ కేంద్రం చేతుల్లోనే కదా ఉన్నది! మరి వీళ్లు(బీజేపీ) ముఫ్తీని మాత్రమే నిందించడంలో అర్థం ఉందా? బీజేపీ ఘోర తప్పిదాలు చేసి, ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది.

ముఫ్తీకి చెంపపెట్టు: బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగింది. ఇవాళ్టి పరిణామం ఖచ్చితంగా ఆమెకు చెంపపెట్టులాంటింది. ఇక కశ్మీర్‌ లోయలో పీడీపీకి భవిష్యత్తులేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే ఎవరికైనా ఇది గుణపాఠం అవుంది. కొద్ది మంది అనుకుంటున్నట్లు 2019 ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లైతే నాదొక సవాల్‌.. రాంమాధవ్‌కు దమ్ముంటే శ్రీనగర్‌ నుంచి పోటీకి దిగాలి. జమ్ముకశ్మీర్‌ విషయంలో బీజేపీ తీసుకున్నవన్నీ తప్పుడు నిర్ణయాలే’’ అని అసదుద్దీన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు