బస్తీలో కుస్తీ

17 Nov, 2018 10:43 IST|Sakshi

ఎంఐఎం కంచుకోటలో గుబులు?

పాతబస్తీలో రూటు మార్చిన మజ్లిస్‌  

ఐదు నియోజకవర్గాల్లో బలమైన ప్రత్యర్థులు

ఈసారి ప్రచారంపై ఎక్కువ దృష్టి

సాక్షి సిటీబ్యూరో: ఎంఐఎం పార్టీకి పాతబస్తీ కంచుకోట. 1962లో పత్తర్‌గట్టి నియోజకవర్గం నుంచి మజ్లిస్‌ పార్టీ తరఫున సలావుద్దీన్‌ ఒవైసీ గెలుపొందారు. అప్పటి నుంచి పాతబస్తీ మజ్లిస్‌ కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ విజయ పతాకం ఎగురవేçస్తూనే ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంపై మజ్లిస్‌ దృష్టిపెట్టేది కాదు. ఎన్నికలకు వారం రోజుల ముందు బూత్‌ లెవల్, పార్టీ ప్రాథమిక అధ్యక్షుల సమావేశాలు నిర్వహించి ప్రణాళిక అమలు చేసేవారు. ప్రచారం కూడా అంతగా చేసేవారు కాదు. ప్రచార సామగ్రి, పార్టీ జెండాలు, కరపత్రాలు కొద్దిగా ప్రచురించి బస్తీల్లో పంచేవారు. అయితే, ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో కార్వాన్, బహదూర్‌పురా తప్ప మిగతా ఐదు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ గెలుపు ఈ దఫా అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జోరుగా ప్రచారం..
బహదూర్‌పురా, కార్వాన్‌ తప్ప, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట్, చార్మినార్‌ నియోజకవర్గాల్లో మహాకూటమి తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. మజ్లిస్‌ చిరకాల ప్రత్యర్థి ఎంబీటీ యాకుత్‌పురా నుంచి గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. దీంతో మజ్లిస్‌ ఈ నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెంచింది. నియోజకవర్గ ఇన్‌చార్జులను నియమించి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, గల్లీలో విస్తృతంగా పాదయాత్రలు చేస్తున్నారు. ప్రచారంలో అత్యాధునిక ఎల్‌ఈడీ తెరలను వాహనాలకు అమర్చి ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో మజ్లిస్‌ చేసిన అభివృద్ధి పనులను కూడళ్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆటోలతో పాటుచిన్న చిన్న వాహనాలను సైతం ప్రచార రథాలుగా చేసి, పోస్టర్లు తగిలించి మరీ గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఆన్‌లైన్‌లో వాయిస్‌ మెసేజ్‌లతో సెల్‌ఫోన్లలో ఊదరగొడుతున్నారు. పోస్టర్లు, కరపత్రాలు, పార్టీ జెండాలు, పార్టీ గుర్తును లైట్లను ఎత్తయిన భవనాలపై అమర్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఈసారి పరిశీలకులను సైతం నియమించడం గమనార్హం. 

ఆ మూడు నియోజకవర్గాలపై ఫోకస్‌
2014 ఎన్నికల్లో బీజేపీ–టీడీపీ కూటమిలో భాగంగా నాంపల్లి నుంచి ఫిరోజ్‌ ఖాన్‌(కాంగ్రెస్‌) ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈయన గతంలో 2009లో కూడా ఈయన గట్టి పోటీనిచ్చి ఓడిపోయారు. మలక్‌పేట్‌లో ముజాఫర్‌(టీడీపీ) 2009 ఎన్నికల్లో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ మహాకూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నాంపల్లి (ఫిరోజ్‌ఖాన్‌), మలక్‌పేట్‌ టీడీపీ అభ్యర్థిగా ముజాఫర్‌ను బరిలోకి దింపారు. దీంతో అన్ని వర్గాలవారు వారికి ఓట్లు వేస్తారని మజ్లిస్‌ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలతో పాటు తన చిరకాల ప్రత్యర్థి ఎంబీటీ కూడా యాకుత్‌పురాలో తన అభ్యర్థిగా మజీదుల్లాఖాన్‌ ఫరహత్‌ఖాన్‌ను పోటీకి దింపింది. ఈయన ఇక్కడి నుంచి గతంలో గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎంఐఎం ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరిన్ని వార్తలు