పీసీసీ అధ్యక్ష పదవికి అజయ్‌ మాకెన్‌ రాజీనామా

4 Jan, 2019 10:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ తప్పుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేసినట్టు మాకెన్‌ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాకెన్‌.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలువనున్నట్టు తెలిసింది. కాగా, మాకెన్‌ రాజీనామాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆమోదించినట్టుగా సమాచారం. 

కాగా, గత రాత్రి తన రాజీనామాను సమర్పించక ముందు మాకెన్‌, రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాను. ఈ నాలుగేళ్లలో నాకు రాహుల్‌ నుంచి, కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి, మీడియా నుంచి అపారమైన ప్రేమ, మద్దతు లభించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది తేలికైన విషయం కాదు. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాన’ని పేర్కొన్నారు.  

గతంలో కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ మాకెన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సలహా మేరకు మాకెన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు