‘సీమ రైతులు చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు’

12 Jan, 2019 16:23 IST|Sakshi

సాక్షి, గుంటూరు : రాయలసీమకు చెందిన పెద్ద పెద్ద రైతులు హైదరాబాదులో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లాం వ్యాఖ్యానించారు. ఏపీలోని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి వరుణ దేవుడు కూడా పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇసుక మీద రెండు వేల కోట్ల రాయితీ ప్రభుత్వానికి వస్తుందని, కానీ ఏపీలో అంత కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

రోజుకి 7.2 కోట్ల రూపాయల డబ్బును టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో కూడా 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం అతి పెద్ద స్కామని, అడుగుకి పదమూడు వందల రూపాయలు చొప్పున పక్క రాష్ట్రాల్లో ఇస్తుంటే ఏపీలో పదివేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..  ‘భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోంది. కాకినాడలో భూముల కేటాయింపులోనూ కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

పన్నెండు వందల రూపాయలకు దొరికే సెటప్ బాక్స్ 14 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పటికే రెండు వేల కోట్లకుపైగా దోపిడీ చేశారు. పెద్ద పెద్ద నేషనల్ హైవేలకు కిలోమీటరుకు 18 కోట్లు కేటాయిస్తే.. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 36 వేల కోట్లు కేటాయించారంటే.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోండి. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే 40 ఏళ్ల అనుభవజ్ఞులు కాదు.. అంకితభావంతో పనిచేసేవారు కావాలి.

మరిన్ని వార్తలు