అప్పుడు బాబాయ్‌.. ఇప్పుడు అబ్బాయ్‌

24 Nov, 2019 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: నాలుగు దశాబ్దాల క్రితం బాబాయ్‌ శరద్‌ పవార్‌ నడిచిన బాటలోనే అబ్బాయ్‌ అజిత్‌ పవార్‌ కూడా నడుస్తూ ఆనాటి మహా డ్రామాను గుర్తు చేస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ ముగిశాక 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ వ్యతిరేక పవనాలు వీచాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరా గాంధీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్‌(ఇందిర), వ్యతిరేక వర్గం నేతృత్వంలో కాంగ్రెస్‌(ఎస్‌)లు ఏర్పడ్డాయి. తన రాజకీయ గురువు యశ్వంతరావు చవాన్‌తో కలిసి కాంగ్రెస్‌(ఎస్‌)లో ఉండిపోయారు. 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోయింది. కాంగ్రెస్‌(ఎస్‌)కు 69 సీట్లు, కాంగ్రెస్‌(ఐ)కు 65 సీట్లు రాగా.. జనతాపార్టీ 99 స్థానాల్లో గెలిచింది.

జనతా పార్టీకి అధికారం దక్కనీయకుండా.. కాంగ్రెస్‌(ఎస్‌)కు చెందిన వసంత్‌దాదా పాటిల్‌ సీఎంగా, కాంగ్రెస్‌(ఐ)కు చెందిన నాసిక్‌రావ్‌ తిర్పుడే డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. ఒక దశలో ప్రభుత్వం నడపడం కష్టంగా మారింది. ఆ సమయంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శరద్‌ పవార్‌ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌(ఎస్‌) నుంచి బయటకొచ్చేశారు. జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్‌తో సత్సంబంధాల్ని ఉపయోగించుకుని ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌(ఎస్‌)కు చెందిన దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు ఆయన మద్దతుగా నిలవగా జనతా పార్టీ అండతో 1978లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 1980లో కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి రావడంతో శరద్‌ పవార్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు.  

>
మరిన్ని వార్తలు