బల పరీక్ష: బీజేపీ ఎంపీతో అజిత్‌ పవార్‌ భేటీ

30 Nov, 2019 10:37 IST|Sakshi

ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావు చికాలికర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అజిత్‌ మరోమారు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతున్నారా అనే సందేహాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అజిత్‌ పవార్.. ప్రతాప్‌రావును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని స్పష్టం చేశారు. తాము వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. తమ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనతో భేటీలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ... శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ గత శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్‌ పవార్‌ ప్రకటించిన తరుణంలో అజిత్‌ పవార్ ఆయనకు ఊహించని షాకిచ్చారు. అనంతరం శరద్‌ పవార్‌ తన చాణక్యంతో అజిత్‌ పవార్ వెనక్కి వచ్చేలా చేసి.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకునేలా ప్రణాళికలు రచించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల కూటమి ‘మహా వికాస్‌ ఆఘాది’  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేయగా.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ఠాక్రేకు డిసెంబర్‌ 3 వరకు గడువు ఇచ్చారు. అయితే ఠాక్రే శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో ఠాక్రే సర్కారు నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. 

మరిన్ని వార్తలు