‘మహా’ డిప్యూటీ అజిత్‌

31 Dec, 2019 02:29 IST|Sakshi
అజిత్‌ను అభినందిస్తున్న గవర్నర్‌ కోష్యారీ. ఆదిత్యను అభినందిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రే

ఆదిత్య ఠాక్రేకు కేబినెట్‌ బెర్త్‌

మంత్రివర్గాన్ని విస్తరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో ఉత్కంఠ వీడింది. శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంత్రివర్గంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సీనియర్‌ నేత అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఉన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్‌ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం సోమవారం మంత్రివర్గ విస్తరణ జరిగింది.

కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్‌ ప్రాంగణంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా విస్తరణలో ఎన్సీపీకి 10 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, శివసేనకు 8 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, కాంగ్రెస్‌కు 8 కేబినెట్, 2 సహాయమంత్రి పదవులు లభించాయి. ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది.

15% నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేసిన సమయంలోనే ఈ మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌కు తాజా విస్తరణలో చోటు దక్కలేదు. ఆయనకు రాష్ట్ర పీసీసీ పీఠం అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.

మిత్ర పార్టీ క్రాంతికారీ షేట్కారీ ప„Š  నుంచి శంకర్‌రావు గడఖ్‌కు కేబినెట్‌ హోదాతో మంత్రిపదవి, మరో మిత్రపక్షం ప్రహార్‌ జనశక్తి పార్టీ నుంచి బచ్చు కడుకు సహాయమంత్రి పదవి లభించాయి. ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రాజేంద్ర పాటిల్‌కు కూడా సహాయమంత్రి పదవి లభించింది. ఎన్సీపీ సీనియర్‌ నేతలు నవాబ్‌ మాలిక్, అనిల్‌ దేశ్‌ముఖ్, దిలిప్‌ వాల్సే పాటిల్, ధనుంజయ ముండే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయ్‌ వాడెట్టివర్‌లకు కూడా తాజాగా మంత్రివర్గంలో స్థానం లభించింది.
 
సంజయ్‌ రౌత్‌కు కోపమొచ్చింది!: కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. తన సోదరుడు, సేన ఎమ్మెల్యే సునీల్‌ రౌత్‌కు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగానే సంజయ్‌ హాజరుకాలేదని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
కేసి పడవీపై గవర్నర్‌ ఆగ్రహం: తొలిసారి కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేసి పడవీపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం చేసేటపుడు స్క్రిప్ట్‌లో ఉన్నదే చదవాలని, లేనిది చదవొద్దని పడవీని మందలించారు. ‘సీనియర్‌ నేతలు శరద్‌ పవార్, మల్లికార్జున్‌ ఖర్గే ఇక్కడే ఉన్నారు.కావాలంటే వారిని అడగండి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పడవీ చేత మళ్లీ ప్రమాణస్వీకారం చేయించారు.
నాలుగోసారి డిప్యూటీ
ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేయడం దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా నవంబర్‌ 23న ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఎన్సీపీ తిరుగుబాటు నేతగా అజిత్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణంచేశారు. తర్వాత ఆయన మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటికి వెళ్లడంతో ఫడ్నవీస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. దాంతో 80 గంటల  సీఎంగా ఫడ్నవీస్, 80 గంటల డిప్యూటీ సీఎంగా అజిత్‌ చరిత్రకెక్కారు.  అయితే, అజిత్‌పవార్‌ గతంలో రెండు పర్యాయాలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

తొలిసారి 2010 నవంబర్‌లో, ఆ తరువాత 2012లో అజిత్‌పవార్‌ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర ప్రజలకు దాదాగా చిరపరిచితుడైన అజిత్‌పవార్‌ ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ సోదరుడి కుమారుడు. 1980వ దశకంలో శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి ఏడు సార్లు ఆ స్థానం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.65 లక్షల భారీ మెజారిటీ సాధించారు. తొలిసారి 1991 జూన్‌లో సహాయమంత్రి పదవి స్వీకరించారు.
 

మరిన్ని వార్తలు