ఇది వాస్తవిక బడ్జెట్‌ : అక్బరుద్దీన్‌ 

12 Mar, 2020 03:25 IST|Sakshi

అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి.. వాటిని ప్రభుత్వం తీర్చాలి 

అదనపు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టం చేయాలి

పాతబస్తీ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఇవ్వాలి

కేంద్ర సహకారం లేకే రాష్ట్రంపై అప్పుల భారం

బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్‌ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్‌ కేంద్ర బడ్జెట్‌ అని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు స్పెషల్‌ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.  

వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. 
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్‌ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్‌ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్‌ సిటీ వైపు విస్తరించాలని, డబుల్‌ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్‌ కార్డులు ఇవ్వాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, వక్ఫ్‌ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు