ఒకే రోజు 13 అనుమతులిచ్చారు: సీబీఐ

8 Jan, 2019 03:52 IST|Sakshi

ఇది యూపీ ఈ–టెండర్‌ విధానానికి విరుద్ధం

అఖిలేశ్‌కు విపక్షాల మద్దతు

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మొత్తం 14 మైనింగ్‌ లీజులకు ఆమోదం తెలిపారని సీబీఐ సోమవారం తెలిపింది. గనుల శాఖను తనవద్దే ఉంచుకున్న అఖిలేశ్‌ 13 లీజులను 2013, ఫిబ్రవరి 17న ఒక్క రోజులోనే క్లియర్‌ చేశారని వెల్లడించింది. ఇది యూపీ ఈ–టెండరింగ్‌ ప్రక్రియకు విరుద్ధమంది. సీఎం ఆమోదంతో ఈ లీజులను అప్పటి హమీర్పూర్‌ జిల్లా కలెక్టర్‌ చంద్రకళ ఇతరులకు కేటాయించారని పేర్కొంది. అలహాబాద్‌ హైకోర్టు ఆమోదించిన ఈ– టెండర్‌ పాలసీ 2012కు విరుద్ధంగా ఈ కేటాయింపులు సాగాయంది.

అఖిలేశ్‌కు మాయావతి ఫోన్‌
అక్రమ మైనింగ్‌ కేసులో అఖిలేశ్‌ను సీబీఐ విచారించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వివక్షాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. బీజేపీ ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తోందని బీఎస్పీ కాంగ్రెస్, ఆప్‌ ఆరోపించాయి. ఈ సందర్భంగా అఖిలేశ్‌కు ఫోన్‌ చేసిన బీఎస్పీ చీఫ్‌ మాయావతి..‘ఇలాంటి గిమ్మిక్కులకు భయపడొద్దు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తోంది’ అని తెలిపారు. ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తును అప్రతిష్టపాలు చేసేందుకే కేంద్రం ఇలాంటి వార్తలను వ్యాప్తిచేస్తోందని మండిపడ్డారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సీబీఐ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశం నిర్వహించడం రాజకీయ కుట్ర కాకుంటే మరేంటని ప్రశ్నించారు.

కూటమిని నిలువరించేందుకే: కాంగ్రెస్‌
2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్ష కూటమి ఏర్పాటును నిలువరించడానికి విచారణ సంస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ విమర్శించారు. అఖిలేశ్‌ యాదవ్‌పై కేంద్రం నిసిగ్గుగా సీబీఐని ఉసిగొల్పుతోందని ప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు