ప్రధాని కావాలంటే మా దగ్గరికి రావాల్సిందే..!

3 Mar, 2019 15:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని కావాలని లేదని, కానీ ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయించే సత్తా ఉందని అన్నారు. కేంద్రంలో ఎవరుండాలని నిర్ణయించడంలో యూపీ ఓటర్లదే కీలక పాత్ర కావడంతో ఏ ప్రధాని తమ వద్దకు వస్తారని.. ప్రధాని మోదీ కూడా అలాగే వచ్చారని తెలిపారు. ఆదివారం జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అఖిలేష్‌ పాల్గొని ప్రసంగించారు. మరి బీఎస్పీ చీఫ్‌ మయావతి ప్రధాని రేసులో ఉన్నారా..? అనే ప్రశ్నకు ..‘మా రాష్ట్రం నుంచి ప్రధాని ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరని ఇప్పుడే చెప్పలేను’ అన్నారు. 

కాగా, 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఎప్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. మోదీ మరోసారి ప్రధాని కావాలని తన తండ్రి ములాయం చేసిన వ్యాఖ్యలపై మట్లాడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని పేర్కొన్నారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే జట్టు కట్టామని తెలిపారు. యూపీలో బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే దీటైన ఎన్నికల ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్‌ను దూరం చేశామని అఖిలేష్‌ చెప్పారు. కాంగ్రెస్‌తో తమకు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు