ఆజంగఢ్ నుంచి అఖిలేష్‌ పోటీ

24 Mar, 2019 12:04 IST|Sakshi

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. 2014లో తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ పోటీ చేసి గెలిచిన ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. ఆదివారం రెండు స్థానాలకు ట్విటర్‌లో అభ్యర్థులను ప్రకటించగా.. ఆజంగఢ్ నుంచి అఖిలేష్, రాంపూర్ నుంచి  పార్టీ సీనియర్‌ నేత ఆజం ఖాన్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ప్రస్తుతం ఆజం ఖాన్ రాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ జాబితాతో ములాయం మరోసారి తన స్థానం నుంచే పోటీ చేస్తారన్న పుకార్లకు తెర పడింది. కాగా ఎస్పీ కురువృద్ధుడు ములాయంసింగ్‌ యాదవ్‌ మెయిన్‌పురి స్థానం నుంచి ములాయం పోటీ చేయనున్నారు. 

మొదట అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కన్నౌజ్ నుంచి పోటీ చేస్తారని పుకార్లు వెలువడినాయి కానీ, ఆయన తన తండ్రి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఆజంగఢ్ కంచుకోటగా ఉంది. ఇక ములాయంసింగ్‌ పోటీ చేయనున్న మొయిన్‌పురి కూడా ఎస్పీకి కంచుకోటగానే చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో ములాయం ఇక్కడ నుంచి గెలిచి రాజీనామా చేశారు. ఇక ఎస్పీ మిత్ర పక్షమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అజంగఢ్‌లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 11న జరగనుంది. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు. (ఆరు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన)

మరిన్ని వార్తలు