నింద చెరిపేస్తే రూ.11 లక్షల బహుమానం!!

6 Aug, 2018 09:13 IST|Sakshi

లక్నో : యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తనపై కుట్ర పన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేఅఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జూన్‌ 2న  అఖిలేశ్‌ యాదవ్‌ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్‌కు గురయ్యారు. బంగ్లాలోని స్విమ్మింగ్‌ పూల్‌లోని టర్కిష్‌ టైల్స్‌తో పాటు, ఇటాలియన్‌ మార్బుల్‌, ఏసీలు, గార్డెన్‌ లైట్స్‌ మాయమమయవడంతో పాటు కొన్ని చోట్ల తవ్వకాలు కూడా జరిపినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి 200 పేజీలతో కూడిన నివేదికను  యూపీ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకుగానూ 6 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ... తాను ఖాళీ చేసిన అధికారిక బంగ్లా గురించి యోగి సర్కారు అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు కూడా సహకరిస్తున్నాయని ఆరోపించారు.

‘ఆరోజు(జూన్‌ 2) రాత్రి నేను బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత బీజేపీ అనుకూల వ్యక్తులు, మీడియా అక్కడికి చేరు​కున్నారు. ఇక అప్పటి నుంచి డ్రామా ఎలా కొనసాగించాలో ప్రణాళికలు రచించారు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని నా పరువు తీయాలని చూస్తున్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని’  వ్యాఖ్యానించారు. బంగ్లాకు నష్టం కలిగించిన దుండగుల గురించి సమాచారమిస్తే 11 లక్షల రూపాయల బహుమానం అందజేస్తానని అఖిలేశ్‌ ప్రకటించారు. తనపై పడిన నింద చెరిపేసేందుకు పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున విరాళాలు వేసుకుని ఆ 11 లక్షల రూపాయలు చెల్లిస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు