‘ఆయనను 72 గంటలు కాదు 72 ఏళ్లు నిషేధించాలి’

30 Apr, 2019 13:08 IST|Sakshi

లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తనతో 40 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసినందుకు మోదీపై 72 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కోరారు. 125 కోట్ల దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాని ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేల అనైతిక ఫిరాయింపులపై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు.

‘ఇది మోదీ బ్లాక్‌మనీ మానసిక స్ధితికి అద్దం పడుతోందని, ఆయనను 72 గంటలు కాదు 72 ఏళ్లు ఎన్నికల ప్రక్రియ నుంచి నిషేధించాల’ని అఖిలేష్‌ ట్వీట్‌ చేశారు. బెంగాల్‌లోని సెరంపూర్‌ లోక్‌సభ స్ధానంలో ప్రచారం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం మీ ఎమ్మెల్యేలు సైతం మీకు దూరమవుతారని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. మీకు ఢిల్లీ బహుదూరమని ఆమె ప్రధాని కావాలనే కలలు ఫలించవని ఎద్దేవా చేశారు. కాగా ప్రధాని వ్యాఖ్యలపై తృణమూల్‌ దీటుగా స్పందించింది. మోదీ వ్యాఖ్యలు చట్టసభ సభ్యులను ప్రలోభపరిచేలా, బేరసారాలకు తెరతీసేలా ఉన్నాయంటూ దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని తృణమూల్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు