గవర్నర్‌గారూ యోగిని నిద్రలేపండి!

15 Jun, 2019 18:50 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం (జంగల్‌ రాజ్‌) కొనసాగుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్రాలో సాక్షాత్తు కోర్టు ప్రాంగణంలోనే యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలిని కాల్చిచంపిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని, అయినా యోగి ఆదిత్యానాధ్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, యోగి ప్రభుత్వాన్ని నిద్రలేపాల్సిన అవసరముందని అఖిలేశ్‌ గవర్నర్‌ రాం నాయక్‌ను కోరారు. శాంతిభద్రతల విషయమై ఆయన శనివారం గవర్నర్‌ను కలిశారు.
 
యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలైన దర్వేష్‌ సింగ్‌ను ఆగ్రా కోర్టు ప్రాంగణంలో ఓ లాయర్‌ కాల్చి చంపిన ఘటన యూపీలో కలకలం రేపుతోంది. గవర్నర్‌ను కలిసిన అనంతరం అఖిలేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘బార్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ను ఆమె చాంబర్‌లోనే కాల్చి చంపారు. జైల్లో ఒక హత్య జరిగింది. ఇలాంటి దారుణాలు ఎలా జరుగుతున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు బార్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ హత్యపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యానాథ్‌ కోర్టుల్లో భద్రత కల్పిస్తామని తెలిపారు. 

ఆగ్రా కోర్టు ప్రాంగణంలో హత్యకు గురైన యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దర్వేష్‌ సింగ్‌ 

మరిన్ని వార్తలు