ఎన్నికలు ముగిసే వరకు మద్యాన్ని నిషేధించాలి

30 Oct, 2018 02:58 IST|Sakshi

సీఈఓకు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రామాల్లో మద్యపానం ఎక్కువైందని, సామాన్య ప్రజలకు ఖరీదైన మద్యాన్ని పార్టీలు అలవాటు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మహిళలు ఆందోళనకు గురవుతున్నారని, ఎన్నికలు ముగిసే వరకు మద్యాన్ని నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

సోమవారం సచివాలయంలో సీఈఓను కలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని అణచివేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. ఒక్కో అభ్యర్థి రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కుల సంఘాలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు. సంఘాలు లేని చోట కూడా ఏర్పాటు చేసి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు.

మరిన్ని వార్తలు