ఆమె ఎటువంటి డిమాండ్‌ చేయలేదు: కేసీఆర్‌

14 Dec, 2017 15:33 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమామాధవరెడ్డి, సందీప్‌రెడ్డి

పార్టీలో వీరికి ఉన్నత అవకాశాలుంటాయన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో వీరిద్దని కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని, ఆయన మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని ప్రశంసించారు. ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎటువంటి డిమాండ్‌ చేయలేదని వెల్లడించారు. ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి రావడం సొంత చెల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబం తనకు ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీయిచ్చారు.

ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న చాలామందికి సహనం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా బాగా వెనకపడిన జిల్లా అని, భువనగిరి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి జరిగి తీరాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో నీళ్లు ఇస్తామని తెలిపారు. జనవరి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తామని కేసీఆర్‌ హామీయిచ్చారు.

మరిన్ని వార్తలు