ఆప్‌కు గుడ్‌బై చెప్పిన అల్కా లంబా

6 Sep, 2019 12:50 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్టీని వీడే సమయం ఆసన్నమైనందున ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమ్‌ ఆద్మీ పార్టీ అసంతృప్త నేత, చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అల్కా లంబా ప్రకటన చేశారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆమెను తొలగించారు. అదే విధంగా కేజ్రీవాల్‌ ట్విటర్‌లో తనను అన్‌ఫాలో చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పొమ్మనలేక పొగపెడుతున్నారంటూ అల్కా గత కొంతకాలంగా ఆప్‌ తీరును విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీలో కొనసాగలేనని... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతునానని ఆమె ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో అల్కా వ్యాఖ్యలపై స్పందించిన ఆప్‌ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా ప్రవరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదని... ఒకవేళ పార్టీని వీడాలనుకుంటే రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించాల్సింది అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై శుక్రవారం స్పందించిన అల్కా...‘ అరవింద్ కేజ్రీవాల్‌ జీ... ట్విటర్‌లోనైనా సరే నా రాజీనామాను ఆమోదించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని మీ అధికార ప్రతినిధి అహంకారపూరితంగా మాట్లాడారు. అందుకే ఆమ్‌ ఆద్మీ పార్టీగా మొదలై.. నేడు ఖాస్‌ ఆద్మీ పార్టీగా మారిన మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా అల్కా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అల్కా లంబా కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సిక్కు వ్యతిరేక అల్లర్లలో రాజీవ్‌ గాంధీపై కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆయనకిచ్చిన దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీ గతంలో తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్కా లంబా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు