కాంగ్రెస్‌లో అసమ్మతి.. కుమారస్వామి వ్యాఖ్యలు

21 May, 2018 12:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం  కొలువుదీరకముందే.. అసమ్మతి వార్తలు ఆ రెండు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలోని ఓ వర్గం జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి పంపకం గురించి ముందే పట్టుబట్టాలని ఆ వర్గం కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం పీఠాన్ని పంచుకునే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై హస్తం పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జేడీఎస్‌ఎల్పీ నేత కుమారస్వామి ఈ కథనాలను కొట్టిపారేశారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నిజమా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘మీకు ఎవరు చెప్పారు? ఆ కథనాలన్నీ బోగస్‌. ఫేక్‌ న్యూస్‌. అందులో నిజం లేదు’ అని కుమారస్వామి తెలిపారు.

ప్రజల ఓటుతో తాను సీఎం కావాలనుకున్నానని, కానీ కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం అవుతున్నానని కుమారస్వామి అన్నారు. ప్రజలు తనకు సొంతంగా మెజారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని తాను కాంగ్రెస్‌ పార్టీని అడగలేదని, కాంగ్రెస్‌ వాళ్లే సీఎంగా ఉండమని తనను అడిగారని చెప్పారు. సీఎం పదవి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనను నాన్న దేవెగౌడ అంగీకరించారని తెలిపారు. రాహుల్‌గాంధీ యువకుడు అని, కాంగ్రెస్‌ను ముందుకు నడిపించాలని అనుకుంటున్నారని చెప్పారు. రాహుల్‌ చేసే పనుల వల్ల బీజేపీకి కొత్త అస్త్రాలు దొరకకూడదని అభిప్రాయపడ్డారు. తన బలపరీక్షకు బీజేపీ ఇబ్బందిపెట్టినా.. తాను గెలిచి తీరుతానని అన్నారు.
 

మరిన్ని వార్తలు