గెలిచేదెవరు హుజూర్‌?

18 Oct, 2019 03:08 IST|Sakshi

సూర్యాపేట: కృష్ణమ్మ పాదాల చెంతన కొలువు దీరిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల 21న జరిగే ఉప ఎన్నిక కోసం యావత్‌ రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నల్లగొండ ఎంపీగా గెలిచినందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోననే అంశం రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో ప్రచార బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తుండగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరో విజయం కోసం చెమటోడుస్తున్నది. మరోవైపు ఉప పోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరగనుండటం, ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంచడంతో ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ నేతృత్వంలోని అధికార యంత్రాగం డేగకన్నుతో కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఉప ఎన్నిక ప్రచార సరళిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

జోరుగా ప్రచారం...
ఉప ఎన్నికలో గెలిచేందుకు గులాబీదళం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించిన సంక్షేమ పథకాలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ప్రధానంగా తమ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి పద్మావతిని గెలిపిస్తే వారి కుటుంబానికి తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి తన ప్రచారంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తమ హయాంలో నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోంది. లింకు రోడ్లు, లిఫ్టులు, సబ్‌స్టేషన్లు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం తమ హయాంలోనే జరిగిందని ఓటర్లకు గుర్తుచేస్తోంది. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా తన భర్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు తప్ప ప్రస్తుత ప్రభుత్వం కాదని పద్మావతి చెప్పుకొస్తున్నారు. ఇక బీజేపీ నేతలు సైతం తమ పార్టీని గెలిపిస్తే కేంద్ర నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి నేతలు, ఇన్‌చార్జులు నియోజకవర్గంలోనే పాగా వేయడంతో గ్రామాల్లో ప్రతిరోజూ రాజకీయ హడావిడి కనిపిస్తోంది. హుజూర్‌నగర్, నేరేడుచర్ల పట్టణాల్లోని లాడ్జీలు, కల్యాణ మండపాల్లో గదులకు ఎక్కడాలేని గిరాకీ ఏర్పడింది.

ఆ పార్టీల ఓట్లతో ఎవరికి దెబ్బ..?
ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపోటములను పక్కనపెడితే వారికి వచ్చే ఓట్ల వల్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరికి నష్టమన్న అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా పెరిక సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ కోట రామారావు, టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన చావా కిరణ్మయి బరిలో ఉండగా వారిద్దరికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వస్తాయనే అంచనా ఉంది. రామారావు తరఫున బీజేపీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి మరీ ప్రచారంలో తీసిపోకుండా ప్రయత్నిస్తున్నారు. కిరణ్మయి కూడా తన వంతు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలకు వచ్చే ఓట్ల వల్ల కాంగ్రెస్‌ పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రధాన పార్టీల బలాబలాలు...
టీఆర్‌ఎస్‌ బలాలు: స్థానిక సంస్థల ఎన్నికలతో బలోపేతం కావడం, అధికార పార్టీగా సానుకూలత, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు.
బలహీనతలు: పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థి అందరినీ కలుపుకొని వెళ్లరనే ప్రచారం.

కాంగ్రెస్‌కు సానుకూలాంశాలు: ఉత్తమ్‌ గతంలో చేసిన అభివృద్ధి, మహిళా అభ్యర్థి కావడం
ప్రతికూలతలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ, పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు

గెలుపోటములను ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్న అంశాలివే:
కేసీఆర్‌ చరిష్మా, ఉత్తమ్‌ పలుకుబడి, ఆర్టీసీ సమ్మె, రైతుబంధు, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ, బీజేపీలకు వచ్చే ఓట్లు, నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం. 

నియోజకవర్గ స్వరూపం ఇదీ..
మండలాలు: నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌ (రూరల్‌), మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం
మున్సిపాలిటీలు: హుజూర్‌నగర్, నేరేడుచర్ల 
ప్రధాన సామాజిక వర్గాలు: రెడ్డి, ఎస్టీ (లంబాడ), మాదిగ, మాల, యాదవ, గౌడ, మున్నూరు కాపు, కమ్మ, పెరిక, వైశ్య

మొత్తం ఓటర్లు.. 2,36,646
స్త్రీలు.. 1,20,320
పురుషులు.. 1,20,320
ప్రచారం ముగిసేది: రేపు (శనివారం)
పోలింగ్‌: ఈ నెల 21న, ఫలితం: 24న 

మరిన్ని వార్తలు